పుట:మధుర గీతికలు.pdf/570

ఈ పుట ఆమోదించబడ్డది


అన్న యెడ కన్న నాదెస నధికభక్తి
నెఱపుచుందువు, కటకటా నేఁ డి దేమి-
ఎంత పిలిచిన మాఱాడ వించుకైన,
తొంటిచందము నీయందు తోపఁ దిపుడు.

మున్ను నా పాదములు భక్తి మ్రొక్కి కాని
అన్న మొగ మైనఁ జూడవు కన్ను లెత్తి,
ఇట్టి నయనిధి వైన నీ కింతలోనె
ఇట్టి భేదంబు కలుగుట కేమి కతమొ?

ఎఱుఁగుదును మున్ను రణభూమి నీవు నిల్చి
క్రూర రాక్షసనివహంబు గూల్చు టెల్ల,
మొక్కవోయెనె యానాఁటి మొక్కలంబు:
నీళ్లు నమలుచు నీ లీల నిలిచె దేల?

భ్రాతఁ గాపాడ నీ కంత భీతి యున్న
నిలిచియుండుము నీ విట, నేనె పోయి
శత్రువుల నెల్ల నొకపెట్ట జక్కడించి
స్వామిఁ గొనివత్తు తలపువ్వు వాడకుండ.

15