పుట:మధుర గీతికలు.pdf/565

ఈ పుట ఆమోదించబడ్డది


సతివి, మంత్రివి, శిష్యవు, సఖివి యైన
నిన్ను హరియించి హతవిధి నిర్ధయుఁ డయి
నాదు సర్వస్వ మక్కటా! నాచికొనియె;
ఎట్లు జీవింతు మొండినై యింకమీఁద?

ఏను ముందుగ చవి చూచి యిడినఁ గాని,
ఆన వెన్నడు రసవంత మైన మధువు,
తరుణి! నీ వింక నేరీతి త్రావఁగలవు
బాష్పకలుషిత మైన నివాపజలము?

ఎల్ల విషయంబులకు నీవె యెల్ల వగుట,
నితర వాంఛలు లేవు నా హృదయమందు;
ఎన్ని విభవంబు లవని నా కున్న నేమి,
నీవు లేకుంట నవి యెల్ల నిష్ఫలములు.

జాలి నీలీల నజమహీపాలకుండు
ప్రియసఖిని గూర్చి విలపింప, వృక్షములును
గూడ కన్నీటివర్షంబు కురిసె ననఁగ,
కుసుమముల నుండి మకరందరసము జాఱె.

10