పుట:మధుర గీతికలు.pdf/563

ఈ పుట ఆమోదించబడ్డది


మధురభాషలఁ బికముల, మందగతుల
హంసముల, విభ్రమంబుల నలరులతల.
కులుకుఁజూపుల లేళ్ళ నాకొఱకు నిలిపి,
అమరపురిఁ జూచు వేడ్క నీ వరిగినావె?

నీదు లీలల వీని యన్నింట నిలిపి
యిట్లు కావించితివి కాని, యివ్వి నీదు
విరహమునఁ గల్గు దుర్భర వేదనంబు
బాయఁజేయునె? యధికంబు చేయుఁ గాని.

గుజ్జుమామిడిగున్న పై కూర్మి మీఱ
బండిగురువిందతీవను భ్రాఁకఁజేసి,
వేడ్క వానికి పెండ్లి గావింపకుండ
వీడి యేగుట నీ కిది పాడి యగునె?

ప్రేమతో నీవు పెనువంగఁ బెరిగినట్టి
అల యశోకము రేకెత్తి యలరు లీనె;
తురుమఁ దగుఁ గాని వాని నీ కురులయందు,
చితిని నర్పింప నా కెట్లు చేతు లాడు?

8