పుట:మధుర గీతికలు.pdf/561

ఈ పుట ఆమోదించబడ్డది


వనవిహారశ్రమంబున నీ వదనమందు
క్రందుకొనియున్న చెమ్మటబిందువులును
ఆఱలే దింక, నీ జీవ మాటిపోయె;
అక్కటా! దేహ మెంతటి యస్థిరంబొ?

చిత్తమున నైన నీకు నేఁ జేసి యెఱుఁగ
నప్రియంబులు, నను వీడి యరుగ నేల?
పేరునకు నేను ధారుణీవిభుఁడఁ గాని,
బద్ధుఁడను సుమ్మి నీయెడ ప్రణయమునను.

పూలతోఁ గూడి తేఁటులఁ బోలు నీదు
నలకజాలంబు గాలి కిట్టట్టు కదల,
ఈవు క్రమ్మఱ బ్రతికితి వేమొ యనెడి
భ్రాంతి పీడించుచున్నధి స్వాంతమందు.

చెలియరో ! నీవు క్రమ్మఱ తెలివి గాంచి,
హిమగిరిగుహాంతరమ్ముల తమము నెల్ల
జ్వలితకాంతుల నోషధుల్‌ తొలఁగఁజేయు
పగిది, నా మనోవేదనఁ బాపఁగదవె?

6