పుట:మధుర గీతికలు.pdf/558

ఈ పుట ఆమోదించబడ్డది


వార లిరువురు నేలపైఁ బడుటఁ జూచి
పరిజనంబులు హాహారవంబు సలుప,
కెలనఁ గొలఁకుఁ గ్రీడించు పులుగు లెల్ల
రోదనము చేసెనో యన రొదలువెట్టె.

తేఱె విభుఁ డంత శైత్యోపచారవిధుల,
ఆమె యించుక కదలక యట్టె యుండె;
అవనిపై నావగింజంత యాయు వున్నఁ
గాదె, ఫలియించు ప్రతికారకాదివిధులు?

శ్రుతి తొలంగిన వల్లకిగతిని నున్న
ప్రాణ మెడలిన యా యింతిఁ బట్టి యెత్తి,
భూమివిభుఁ డంత సమధిక ప్రేమతోడ
చేర్పఁగాఁ దగు తన యంకసీమఁ జేర్చె.

ఉసురు వాసి వివర్ణయై యున్న యామె
నొడిని జేరిచి భూవిభుఁ డొప్పె నపుడు,
అంకమున నావిలం బగు జింకతోడ
వేకువను వెల్లఁబాఱిన విధునియట్లు.

3