పుట:మధుర గీతికలు.pdf/550

ఈ పుట ఆమోదించబడ్డది

గోగీతము

ఇది పురాణేతిహాస ప్రబంధములలో గోవ్యాఘ్ర సంవాదమనే పేరున చిత్రింపబడిన నీతిబోధాత్మకమగు సరిక్రొత్త పాతకధ. అయితే కవిచెప్పినతీరు, ఉపయోగించిన భాష, పాత్రల చిత్రణ వినూత్నముగా వుంటుంది. గోవువర్ణన, దాని శీలమూ, హృదయంగమంగా వుంటవి. "శాంతమున గెల్వరానిది జగతిగలదె” అని కవి సిద్ధాంతీకరిస్తాడు ఒక అర్థాంతరన్యాసప్రయోగంతో. ఇది గాంధీమహాత్ముని దృష్టిలో నుంచుకుని చేసినదిగా కనిపిస్తుంది. కవి గాంధేయుడు. ఇటీవల అపురూపమై పోతూవున్న ముక్తపద గ్రస్తాన్ని యిందులో ప్రయోగించాడుకవి.


“తువ్వ కాదది తేనియ గవ్వ గాని
గవ్వ కాదది నునువెండి మువ్వ గాని
మువ్వ కాదది తెలిమల్లె పువ్వు గాని
పువ్వు కాదది జిగివెన్నముద్ద గాని” అనీ

ధేనువుకు తన వత్సముమీదనున్న వాత్సల్యాన్ని మనకన్నుల ఎదుట ఆ ‘తువ్వ' కనుపించేలా చిత్రించాడుకవి. మనచేత కన్నీరు పెట్టించేటంతటి స్వాభావికంగా వున్నది ఆచిత్రణ.

13