పుట:మధుర గీతికలు.pdf/543

ఈ పుట ఆమోదించబడ్డది

మృత్యుసాన్నిధ్యంలో యిది చాలా అనౌచిత్యమని, కవి భావించి “మన విహారశ్రమంబున నీ వదనమందు, క్రందుకొని యున్న చెమ్మట బిందువులును ఆఱలేదింక” అని మార్పు చేసి మూలంలోని అనౌచిత్యాన్ని పరిహరిస్తాడు. ఆమెమృతివలని చింతతో ఆమె ధరించిన కనకమేఖల "మధురమంజుల రవములు మాని యుండె" నట అతిసుకుమారసుందర శిరీషము వలె నున్న దీ లలితప్రయోగము. కనకమేఖలకే మంజులారావములు స్వాభావికముకదా.

కాళీదాసు "విలపన్నితి కోసలాధిప---స్రుతశాఖార సబాష్ప దుర్దినాన్” (8–70) అంటూ అజుని శోకానికి ప్రకృతి కూడా విలపించిన దంటాడు. “వృక్షములును, గూఢ కన్నీటి వర్షంబు కురిసె ననగ, కుసుమముల నుండి మకరందరసము జారె” అంటాడుకవి. మూలములో వృక్షశాఖలు రసబాష్పములను కురిసిన వని వుండగా, కవి ఆ శాఖలమీది కుసుమములు మకరందమును బాష్పబిందువుల వలె కురిసిన వనడంలో చాలా ఔచిత్యం కనిపిస్తుంది. ఇలా యిది అనువాదంవలె కనుపింపక, మూలానికే వన్నె పెట్టబడింది.

6