పుట:మధుర గీతికలు.pdf/517

ఈ పుట ఆమోదించబడ్డది



కలిత ఖర్జూరసుమముల కాంతి గలిగి
చక్కఁగా పండి బంగారుచాయ వెలయ
ఎన్ను వ్రేఁగున ముందు కొక్కింత వంగి
పొలిచె వరిపైరు తండులపూర్ణ మగుచు.

సురలఁ బితరుల సంతుష్టి పఱచుపొంటె,
అపుడ పండిన క్రొత్త ధాన్యములఁ దెచ్చి
ముంగిలులయందు పొంగలుల్ పొంగఁ జేసి,
వెలసి రెల్ల రు నపగతకలుషు లగుచు.

లేఁతపచ్చికజొంపముల్ మేఁత మేసి
కొలఁకులను దేఱు నిర్మలజలము ద్రావి
రంతుగొనుచు కణిల్ల ని ఱంకెవై చి
చియ్యబట్టిన యాఁబోతు చెంగలించె.

కొలనుదరిఁ జేరి దప్పిచే కుంజరములు
స్వచ్ఛమై శీతలం బగు జలము దాకి
జల్లు మని దేహ మెల్లను జలదరింప
పూత్కరించుచు తొండముల్ ముడిచికొనియె.