పుట:మధుర గీతికలు.pdf/515

ఈ పుట ఆమోదించబడ్డది

హేమంతఋతువు



ధరణి యెల్ల ను సస్యసంభరితమయ్యె,
ఆలకదుపుల పొదుఁగుల పాలు కురిసె,
కొలఁకులందలి జల మెల్లఁ గలకదేఱె,
కడిఁదిచలిచేత గజగజ వడఁకె జగము.

బిరుసువాఱెను ప్రజమేను, బురద లివిరె,
పైరుపచ్చలు మెఱుఁగెక్కె, పాఁడి హెచ్చె,
దహన మిం పయ్యె, పానీయ మహిత మయ్యె.
దినము కుఱు చయ్యె, రాతిరి దీర్ఘ మయ్యె.

ఇంటనింటను చలిమంట లేపు మీఱె
పచ్చడంబులు కంబళ్ళు పెచ్చు పెరిగె
తాళవృంతంబు లటకలమూల కెక్కె
ఆతపత్రంబు లందంద యడఁగిపోయె.

64