పుట:మధుర గీతికలు.pdf/514

ఈ పుట ఆమోదించబడ్డది


ఘననృపాలుఁడు పాలించు గగనపురిని
ఇంద్రచాపపు గోపుర మెత్తువేళ,
విరసవాక్కుల వర్ణించు భేకనామ
కాకవులకు పంకాభిషేకము లభించె.

బలిమిమై తీవ్రకరములఁ బఱపి యినుఁడు
ధరణిఁ దా మున్ను గుంజిన ద్రవ్య మెల్లఁ
గ్రక్కె, పరులను పీడించి బ్రతుకువారి
పాటు లిట్టివె గద యని చాటె ననఁగ

జడముకంటె జలంబును, జలముకంటె
వాయు వెక్కుడు బల మంచు పగటె ననగ,
ధూళి చెలఱేఁగి వానచేఁ దూలిపోయె:
గాలి యడరంగ వర్షంబు డీలువడియె.

63