పుట:మధుర గీతికలు.pdf/513

ఈ పుట ఆమోదించబడ్డది


రయముగాఁ బాఱు వానగుఱ్ఱాల నెక్కి
మెఱపుకొరడాల ఝళిపించి తఱటుచేసి
మబ్బురౌతు లుడాయించి రుబ్బు మెఱయ
నింగి పేరిటి పందెంపునేల యందు.

వానచినుకులు చొరకుండ పాములు తమ
పుట్టబొఱియలపై నెత్తివెట్టు తెల్ల
పట్టుగొడుగులో యనులీల, పుట్టగొడుగు
లలరి చూడ్కికి వేడ్కలు గొలుపుచుండె.

ఒయ్యనొయ్యన తనపుట్టనుండి వెడలి
మిన్ను పేరిటి పెనుగోడమీఁదఁ బ్రాఁకు
వింతవన్నెల యూసరవెల్లి యనఁగ,
ఇంద్రచాపంబు కాంతితో నెసక మెసఁగె.

పెక్కువన్నెలతంతులఁ బేర్చి కూర్చి
లీల నల్లిన మరుని యుయ్యాల యనఁగ,
సాంద్రకాంతులఁ జూపట్టె నింద్రధనువు
కనులపండువు చేయుచు గగనవీధి.

62