పుట:మధుర గీతికలు.pdf/508

ఈ పుట ఆమోదించబడ్డది




మొగులు మొగులున మెఱుఁగులు నిగిడి మెఱసె
మెఱుము మెఱుమున నుఱుములు మెండుకొనియె
ఉఱుము నుఱుమునఁ బిడుగులు తఱచు రాలె
పిడుగులను మించి వడగండ్లు పెచ్చు పెరిగె.

చిమ్మచీఁకటి జగ మెల్లఁగ్రమ్ముకొనియె;
కలయ మీన్నును మన్ను నేకంబు గాఁగ,
బోరుబోరునఁ దోరంపుధార లడర
కుంభవృష్టిగ వర్షంబు గురియుచుండె.

బెకబె కంచును కప్పలు బిట్టు కూసె
తకపి కంచును నెమలి తైతక్కలాడె
చాతకంబులు నింగిని సంచరించె
ఇంద్రగోపము లొప్పొరె నెల్ల యెడల.

ఆకసంబున తూనీఁగ లాడఁ జొచ్చె..
గుంపులుగఁ గూడి చీమలు గ్రుడ్లుమోచె
కొంగకదుపులు బారులై నింగి కెగసె
త్రాచుపాములు పుట్టల దాఁగియుండె.

57