పుట:మధుర గీతికలు.pdf/505

ఈ పుట ఆమోదించబడ్డది



మిగులఁ గాసిన మిడియెండ సెగల నొగిలి
ఆశ్రయించిన గంగయు యమున యనఁగ,
మల్లియలతోడి కీల్జడలల్ల లాడ
చలువపందిళ్ళఁ బొలిచిరి జలజముఖులు,

లలిత మంజీరరవ మొప్ప, లత్తుకలను
జొత్తువాఱిన పదములు శోభిలంగ,
అమలవస్త్రంబులను దాల్చి, అంచ లనఁగ
మందయానలు నడచిరి మద మెలర్ప,

భీష్మతరమైన దారుణ గ్రీష్మమందు
గాలిచే మింటి కెగసిన ధూళి యొప్పె,
దండిగాఁ గాయు నెండకు తల్లడిల్లి
పుడమిచేడియ దాల్చిన ముసుఁ గనంగ.

చండమార్తాండు నెండకు మండి మండి
జగము రగులంగ, గాలిచే నెగసినట్టి
బూదియో యన, బూరుగుదూది పిగిలి
పింజపింజగ నంబరవీధి: కెగిరె.

54