పుట:మధుర గీతికలు.pdf/504

ఈ పుట ఆమోదించబడ్డది



చండతరమైన యెండకు జలము లెండి
పడియయందలి యడు గెల్ల పగులువాఱ,
బీఁటికలవెంట తన నిడుపాటితోటి
గ్రుచ్చి, బొమ్మడాయల మెక్కెకొక్కరాయి.

దావపావకకీలల దగ్ధ మొంది
చెట్లయాకులు సుడిగాలిచేత ఱేఁగి
గగనమున పల్లటీల్ గొని యెగురుచుండ,
పావురము లంచు డేగలు పట్టఁ దఱిమె.

భీకరం బగు నెండకు భీతి జెంది
పాదవచ్ఛాయ నిదురించు పథికజనులు
మాటిమాటికి తావుల మార్చి మార్చి
పొరలియాడిరి నీడలు జరుగుకొలఁది.

మల్లెపువ్వులు సిగఁదాల్చి మాపులందు
చెఱకురస మాన గానుఁగచెంత జనము
కూడె, రానున్న వృష్టికై గ్రుడ్లు మోచి
మధువుచుట్టును మూఁగు చీమలొ యనంగ...

53