పుట:మధుర గీతికలు.pdf/503

ఈ పుట ఆమోదించబడ్డది




మెండుగాఁ గాయు నెండకు మిడికి మిడికి
నోరు తెఱచుచు సెలవులు నురువు గాఱ
పొలసుముద్దలఁ బోలు నాల్కలు వెలార్చి
దున్నపోతులు తిరిగె దుందుడుకు సెంది.

మిటమిటని కాయు నెండకు కటకటఁబడి
కుతుక లెండఁగ దప్పిచే కొదమలేళ్ళు
చదల కాటుకమబ్బులు జలము లనుచు
బమ్మరిల్లుచు నాసచేఁ బరుగులె త్తె .

దండిగాఁ గాయు నెండల మండి మండి
కొండ లోర్వక మొఱపెట్టి కూసె ననఁగ,
గహ్వరంబులఁ బోలు వక్త్రములఁ దెఱచి
బెబ్బులులు గాండ్రు గాండ్రని బొబ్బరించె.

దారుణం బగు నెండకు తాళలేక.
నీరు లింకిన మడుఁగులఁ జేరి పంది
ము స్తె లెత్తఁగ నిడువాడిముట్టెతోడ
గ్రొచ్చికోరాడె పుడమిలోఁ జొచ్చుకరణి.

52