పుట:మధుర గీతికలు.pdf/491

ఈ పుట ఆమోదించబడ్డది


అంత నొకనాఁడు మైసూర సంత జరుగ,
నచటి కేగిరి వేడ్కతో నతివ లెల్ల
నళిని యొంటిగ నెవరికిఁ దెలియకుండ
పయనమై యేగె ప్రియుఁడున్న పట్నమునకు,

విలువనగలును వలువలు విడిచి, యామె
చిరుఁగుబట్టలు ధరియించి, పురమువెంట
నుల్ల మురియాడ, నాదిన మెల్ల తనదు
ప్రియుని వెదకుచు తిరుగాడె వీధివీధి.

సొమ్మసిలి యామె యూరెల్లఁ ద్రిమ్మరిల్లి,
దారుణం బగు నెండకు తాళలేక,
చేనిగట్టున గూర్చుండె సేదదేఱ;
హయము పై నెక్కి తన మనోహరుఁడు వెడలె.

ప్రియునిఁ గన్గొన, డెంద మువ్విళులు గొనఁగ.
చివ్వునను లేచి కళ్ళెంబు చేతఁ బట్టి,
'ఓ దయామయ, నే నిఱుపేదరాల,
కావుమా నన్ను దయతోడ కాని యొసఁగి,'