పుట:మధుర గీతికలు.pdf/488

ఈ పుట ఆమోదించబడ్డది



కట్ట! సాలీఁడు పలికిన కల్ల బొల్లి
బేలుమాటల కా యీఁగ బేలువోయి,
వానిమాటలె నిజ మని భ్రాంతి జెంది
పొంగి పొరలుచు కెరలుచు నింగి ముట్టె.

తనదు కన్నుల తళతళల్, తనదు మేని
నిగనిగల్, తనఱెక్కల ధగధగలును,
తనదు పలుకుల మురిపంబు, తన శిరంబు
మురువుతలపోసి యాయీఁగ మురిసిపడుచు,

జుంయి జుం యని యెగురుచు, జుమ్మటంచు
పాట పాడుచు, సాలీని గూఁటిచుట్టు
చెలఁగి గుఱ్ఱునఁ దిరుగుచు, చెంగలించి,
చంగు మని యట్టె లోనికి చౌకళించె.

ఏమి చేయుచు నుంటివే ఈఁగ నీవు?
పవ్వడించితొ మవ్వంపు పాన్పు జేరి?
ఊఁగుచుంటివో హాళిమై నుయ్యెలపయి?
కజ్జముల మెక్కు చుంటివొ బొజ్జనిండ?

37