పుట:మధుర గీతికలు.pdf/487

ఈ పుట ఆమోదించబడ్డది



ఇట్టు తలపోసి పాప మా చిట్టియీఁగ
మాఱు పలుకక యట్టిట్టు తారుచుండె;
తనదు పాచిక పాఱెఁగా యనుచు మదిని
నలరి, సాలీఁడు క్రమ్మర నందుకొనియె.

“రమ్ము, చక్కనిచుక్కరో, రమ్ము వేగ;
ఱెక్కలా యవి, అబ్రంపురేకులు గదె!
కన్నులా యవి, రతనాలగనులు గాదె!
మాటలా యవి, ముద్దుల మూటలు గదె!

మెఱయు చున్నది నీ చిన్ని శిరము మీఁద,
కుచ్చు కెంపుతురాయిని కూర్చి రేమొ!
నిగనిగలు దేఱుచున్నది నీదు మేను,
చికిలిపచ్చలు నీలాలు చెక్కి రేమొ!

రాఁగదే చిన్ని యీఁగలరాణి, రావె:
రాఁగదే నాదు భాగ్యంపురాసి, రావె!
రాఁగదే తళ్కు మెఱపులతీఁగ, రావె:
రాఁగదే ముద్దుగుమ్మరొ, వేగ రావె!”

39