పుట:మధుర గీతికలు.pdf/486

ఈ పుట ఆమోదించబడ్డది


ఈఁగ

చెలఁదిరో, నీకు నామీఁదఁ గలుగుప్రేమ
చాలు పదివేలు, నాజోలి యేల నీకు?
కుడువఁ బెట్టెదవో నాకు కడుపు నిండ,
ఆరగింతువొ నను నీవె హాయి మీఱ?

సాలీఁడు

ఔనె: యీఁగరొ, ఎంత మాటాడినావె!
ఇన్ని వగ లెందు నేర్చితే వన్నెలాడి!
నిగనిగలు దేఱు నీలాలు నీదు గఱులు,
నిద్ద మగు జాతికెంపులు నీదు కనులు.

ఎంత చక్కనిదానవే ఈఁగ నీవు!
పొగడఁగూడదు కాని నీ సొగసుఁదనము -
అదిగొ, ఇటు వచ్చి యా నిల్వుటద్దమెదుట
నిలిచి యొక సారి చూచిన, నీకె తెలియు.”

తన్ను సాలీఁడు పొగడు స్తోత్రముల కుబ్బి
ఈఁగ తబ్బిబ్బు నొందుచు, నిట్లు తలఁచె:
“అక్కటా! నాదు కులవై రి యనుచు నెఱిఁగి
ఎట్లు నమ్ముదు మనసార ‘ఈగపులి’ని”

35