పుట:మధుర గీతికలు.pdf/485

ఈ పుట ఆమోదించబడ్డది


సాలీఁడు

ఉల్లి పొర వంటి నునుఱెక్క లల్ల లాడ,
ఏటి కాయాసపడెదవే యెగిరి యెగిరి?
నిద్ద మగు నాదు సెజ్జపై నిన్ను జేర్చి,
నెమ్మి జోకొట్టి హాయిగ నిదురవుత్తు.

ఈఁగ

అమ్మచెల్లరొ! నీ మాట నమ్మనగునే?
అడుగు మోపగఁ జాల నీ గడపలోన;
లీల నీ పాన్పుపై పవ్వళించువారు
మేలుకొన రింక, నెన్నఁడు మేలుకొనరు.

సాలీఁడు

ప్రియము మీఱఁగ నెన్ని చెప్పినను గాని,
నమ్మవేటికె మిత్రమా, నాదుమాట?
వలపు లొలికించు కమ్మని వంటకములు
కుడువఁబెట్టెద, రమ్ము, నీ కడుపునిండ.

34