పుట:మధుర గీతికలు.pdf/484

ఈ పుట ఆమోదించబడ్డది

ఈఁగ, సాలీఁడు


సాలీఁడు

ఎచటి కేఁగెద వీఁగరో, ఇట్లు రమ్ము !
మేల్మిబంగరుఱెక్కలు మెఱుఁగు లీన,
మింటి కెగిరెద వేల? నా యింటిలోకి
వచ్చి యొకసారి విశ్రమింపంగరాదె?

చుట్టు ప్రాకారములు గల్గి, నట్టనడుమ
ముద్దు గులికెడు నా చిన్నిమిద్దె గలదు,
మిద్దెపై కేగ నెల్లెడ మెట్లు గలవు;
సాటి వచ్చునె దానితో స్వర్గమైన?

ఈఁగ

రాను సాలీఁడ, నీ యింటి కేను రాను,
సాలెగూఁడది యీఁగలపాలి సూడు;
సుందరం బగు నీ యిల్లు జొచ్చువారు
ప్రాణముల తోడ మరల నీవలకు రారు.

33