పుట:మధుర గీతికలు.pdf/476

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు వచియించి గోవిందుఁడలుక గదుర
బలిమిమై చిన్ని బాలుని పులిమి లాగి,
రెట్టబట్టుక కుందను నెట్టివై చె,
బోరు మని యేడ్చి బిడ్డండు పోరువెట్ట.

కనుల జలజల బాష్పముల్ కాల్వగట్ట,
వెడలె నాబాల పదములు తడఁబడంగ,
బిడ్డ యేడుపు వీనులఁ బడ్డయప్పు
డెల్ల జల్లని గుండియల్ తల్లడిల్ల

'కన్నతల్లి యు తండ్రియు చన్నదాది
మామయే యన్ని తానెయై మనిచె నన్ను:
అట్టి యాతఁడే నన్నిప్పు డవలఁ ద్రోసె;
కంచెయే చేను మేసినఁ గలదె దిక్కు?'

కుంద యీరీతి డెందంబు నందుఁ గుంది
పున్నయింటికిఁ జనుదెంచి, పొంగి పొరలి
నెట్టుకొని వచ్చు శోకంబు నెట్టకేని
మట్టు పఱచుచు, నామెతో నిట్టు లనియె.

25