పుట:మధుర గీతికలు.pdf/470

ఈ పుట ఆమోదించబడ్డది


తనయుఁ డిట్లనె గద్గదస్వనముతోడ:
“నాన్న: నీయాన జవదాఁటి యెన్నఁ డెఱుఁగ
నేఁడు నీకోర్కె నెఱవేర్పనేరకునికి
చింత నొందుచు నుంటి నా చి త్తమందు.

కుంద నీవు వచించినచందమునను
నిఖిలలావణ్యలక్షణాన్వితయె యయ్యు,
ఇంచుకంతయు నామది కెక్క దయ్యె -
ఏమి కారణమో వచియింపఁ జాల

చిన్నతనముననుండియు 'చెల్లె’ లనుచు
పిలిచితినిదాని, నేనిప్డు ‘పెండ్ల’ మనుచు
ఏగతిఁ దలంతు? నక్కటా; యిట్లు చేయ,
నన్ను పరికించి నలువురు నవ్వ రొక్కొ?"

కనుల నిప్పులు రాలంగ జనకుఁ డనియె:
"అక్కటా! తండ్రియాజ్ఞను ధిక్కరించి
ఇట్లు వచియింప నీకు నో రెట్టు లాడె?
అవుర! ఎంతటివాఁడ వైతివిర నీవు?

19