పుట:మధుర గీతికలు.pdf/469

ఈ పుట ఆమోదించబడ్డది


అంత నొకనాఁడు వృద్ధుండు సంతసమున
దనదు కూరిమితనయుతో ననియె, “వత్స!
వయసు గడచెను, ముదుసలివాఁడ నైతి,
ఎపుడు మృత్యువు వచ్చునో యెఱుఁగరాదు.

అనుభవించితి సకలసౌఖ్యంబు లెలమి,
కోర్కు లెల్లను కొనసాఁగె కొదవ లేక:
మక్కువను చిన్ని మనుమని నక్కు జేర్చి
ముద్దులాడుట యెన్నఁడో ముచ్చ టలర?

పోతబోసిన బంగారుబొమ్మవోలె
ఒక్క చిన్నారి చక్కనిచుక్కఁ దెచ్చి
పరిణయ మొనర్తు, వేగమే పడయు మయ్య
పండువంటి కుమారుని నిండువేడ్క

చల్ల కై వచ్చి ముంత దాఁచంగ నేల!
కుందయే నీకు సరివచ్చు సుందరాంగి,
జనని పోయినదాదిగా చనపు మెఱయ
పెంచితిని దాని నీ కిచ్చి పెండ్లి చేయ.”

17