పుట:మధుర గీతికలు.pdf/459

ఈ పుట ఆమోదించబడ్డది


ఆతఁ డంతట నా క్రొత్త యతని తోడ
'ఎవరు మీరలు! మీరాక యెచటినుండి?
ఏమిపని కల్గి వచ్చితి రిచటి కిపుడు?'
అనుచు ప్రశ్నింప, నవ్వుచు నాతఁ డనియె.

"ఎఱుఁగవా నన్ను? నాపేరు హిమకరుండు,
మున్ను నీతండ్రి జీవించి యున్న యపుడు,
నీదు చిన్నారిచెల్లెలు నేను గూడి
ఆడుకొంటిమి కాదె యీ మేడ యందు?

‘ఇందుకళ’ యప్డు పదియేండ్ల యీడు బాల
చికిలిసేయని మారుని చిన్ని కోల
అన్నెమును పున్నె మెఱుఁగని యట్టి బేల
నన్ను తలపెట్టుచుండునే యెన్నఁ డైన?

ముఖ్యముగ నొక్కవిషయంబు ముచ్చటింప
నేను వచ్చితి - ఆకార్య మైనపిదప,
సావకాశముగా నన్ని సంగతులను
గూర్చి మాటాడుకొందము కూర్మిసఖుఁడ!

8