పుట:మధుర గీతికలు.pdf/458

ఈ పుట ఆమోదించబడ్డది


ఇట్టు తలపోసి, చందువా పెట్టె తెఱచి,
ఆతఁ డందలి వేఱువే ఱరలనుండి
ఒక్క టొకటిగ పత్రంబు లూడఁబెఱికి,
చించి కుంపటి కాహుతి చేయుచుండె.

వేఁగుజా మయ్యె నింతలో వీధితలుపు
తట్టినట్టులు వినవచ్చె; తత్తరమున
నులికిపడి లేచి వేగమే తలుపు తీసె
దేవదత్తుఁడు కరమున దివ్వె దాల్చి.

త త్తడుల నెక్కి భటుఁ లిరుతట్టు గొలువ,
మారుఁ బోలిన సుందరాకారుఁ డొకఁడు
గజము డిగి దేవదత్తుని కౌఁగిలించె
చిఱునగవు మోముదమ్మిని తుఱఁగలింప.

విస్మయంబును మోదంబు పెనఁగొనంగ,
దేవదత్తుఁడు మో మెత్తి తేఱిపాఱ
వానిఁ దిలకించి, యొక్కింతవట్టు తనదు
వెతల నన్నిటి నొకసారి విస్మరించె.

7