పుట:మధుర గీతికలు.pdf/457

ఈ పుట ఆమోదించబడ్డది


నిలిచియున్నది నీచేత నెలఁత బ్రతుకు-
మనిచెదవొ యామె ప్రాణంబు మం దొసంగి,
మునిచెదవొ నన్ను శోకసముద్రమందు?
చెప్ప నేటికి-నీదివ్యచిత్త మింక.'

అంచు నేమేమొ యింక వచించుచుండ,
తటుకునను లేచి వైద్యుండు తలుపు మూసి
రివ్వు మని యేగె; 'హాః శ్రీహరీ!' యటంచు
నేలపై దేవదత్తుండు కూలఁబడియె.

అట్లు పడి కొంతసేపటి కతఁడు లేచి
తెప్పిరిలి, లేనిసత్తువ తెచ్చికొనుచు,
ఎట్లా కాళ్ళీడ్చుకొని తనయిల్లు జేరి,
ఇట్టు తలపోసె నిస్పృహ తట్టుముట్ట.

'ఎన్ని లక్షల పత్రంబు లున్న నేమి-
గిరిజప్రాణము నేఁడు రక్షింప వయ్యె;
గవ్వకైనను కొఱగాని కాగితంబు
లకట! ఉండిన మండిన నొకటి కాదె. '

6