పుట:మధుర గీతికలు.pdf/456

ఈ పుట ఆమోదించబడ్డది


అఖిల సౌభాగ్యసంపద లనుభవించి
నట్టి భోగికి, తనదు నర్ధాంగలక్ష్మి
మరణవేళను గొంతులో మందు బోయ,
కటకటా ప్రాప్తి లేదయ్యె-కాలమహిమ!

నాఁటిరాతిరి గిరిజకు గాట మగుచు
జ్వరము ముమ్మర మయ్యె, శ్వాసంబు హెచ్చె;
వెంటనె యతండు వైద్యుని యింటికడకు
తత్తరంబున పరుగెత్తి, తలుపు తట్టె .

అలికిడికి లేచి వైద్యుండు తలుపుతీసి,
'ఎవరు వా?' రని ప్రశ్నించి, ‘ఈవటోయి!
పై కమును తెచ్చితివ సరే-లేకయున్న,
శీఘ్రముగ నింటికడకు వేంచేయవచ్చు.'

అనుడు, గుండెలు జల్లన, కనుల నీరు
నిండ నేడ్చుచు దేవదత్తుండు పలికె,
'నీదు పాదాంబుజంబులమీఁద వ్రాలి.
వేఁడువాఁడను, నన్ను కాపాడు మయ్య.

5