పుట:మధుర గీతికలు.pdf/454

ఈ పుట ఆమోదించబడ్డది


ఆ గభీర నిశాసమయంబు నందు
దీర్ఘ నిశ్వాసములు పుచ్చి దేవదత్తుఁ
డొక్క గదిలోనఁ గూర్చుండి చెక్కు మీఁద
చేయి నానించి, యేదొ యోచించుచుండె.

వాని పజ్జనె సెజ్జపై వాలి, యతని
గృహిణి సర్వాంగసుందరి గిరిజదేవి
దుర్భరం బగు వ్యాధిచేఁ దూలి సోలి
చిక్కి శల్యావశిష్టయై స్రుక్కుచుండె.

వారములు నాల్గు గతియించె వ్యాధిపొడమి
అంతకంతకు నతిశయం బగుటె కాని,
ఇంచుకంతయు స్వస్థత గాంచదయ్యె;
కటకటా! ఎట్టి మొండిరోగంబొ కాని.

ఎందరో వైద్యులై, రెన్నో మందు లయ్యె,
ఎంతయొ ధనంబు వ్యయ మయ్యె, సుంతయైన
కుదురు వడదయ్యె రోగంబు; తుద కతండు
అప్పుసప్పులపా లయి ముప్పు జెందె.

3