పుట:మధుర గీతికలు.pdf/453

ఈ పుట ఆమోదించబడ్డది




బల్లెములఁ గేలఁ దాలిచి బారు దీఱు
యోధవరులకు బదులుగ, సౌధమెదుట
బమ్మచెముడులు బలుసులు తుమ్మపొదరు
లీతచెట్టులు దట్టమై యేపు సూపె,

గోరువంకలు చిలుకలు పావురములు
మధురగానంబు సలిపిన మందిరమున,
కాకములు గుడ్ల గూబలు గబ్బిలములు
నెలుకలును జేరి చీకాకు గొలుపుచుండె.

మదగజంబులు, తురగముల్ మసలు చోట
ఊరపందులు గాడిదల్ తారుచుండె;
వింతవన్నెగులోబులు వ్రేలుచోట,
సాలెపట్టులు బూజులు వ్రేలుచుండె.

ఒంటి గంటయ్యె-దీపంబు లొకటొకటిగ
సన్నగిల్లెను, బాణసంచాల మాని
తలుపులను మూసి జనులు నిద్రావధూటి
నిండుకౌఁగిట నోలాడుచుండి, రంత.

2