పుట:మధుర గీతికలు.pdf/444

ఈ పుట ఆమోదించబడ్డది




'మాల మా' లని యేల గగ్గోలు సేయ ?
‘మాట తప్పినయాతఁడే మాల గాని,
కులము చండాలుఁ డయ్యును కొఱత గలదె?'
అనుచు వేమనయోగీంద్రుఁ డాడలేదె?

జన్నిదము దాల్చిననే అగ్రజన్ములనుచు
పొంగిపొరలెద రేటికి వెంగలు లయి?
ధర్మదీక్షయె తన జన్నిదంబు కాని,
జన్నిదం బౌనె బారెడు కన్నెత్రాడు?

బొట్టు జుట్టును దాల్చుట ముక్తి యనుచు
పట్టి పెనఁగెద రేటికి పందలార?
జ్ఞాన వైరాగ్య సద్గుణగణమె కాని,
జుట్టు బొట్టును జ్ఞానంబు చూపఁగలవె?

భూతి పూసిన మాత్రన మోక్ష మనుచు
మురిసిపడియెద రేటి కో మూర్ఖులార?
నీతివర్తనమే భూతిపూత గాక.
బూడిదను పొర్లు గాడిద ముక్తిగనునె ?

71