పుట:మధుర గీతికలు.pdf/443

ఈ పుట ఆమోదించబడ్డది


అధమవృత్తులఁ బాల్పడి యధికుల మని
విఱ్ఱవీగెద రేటి కో విప్రులార ?
పరుల సేవన మొనరించు బ్రాహ్మణుండు
అధముఁ డగు గాని, అగ్రజుం డగునె తలఁప?

జన్మమునఁ దొల్త శూద్రులే సకలజనులు,
అవల సంస్కారమున ద్విజుఁ డగు నరుండు,
వేదపాఠంబుచే నంత విప్రుఁ డగును,
బ్రహ్మ మెఱిగినపిదప తా బ్రాహ్మణుఁ డగు.

‘వృత్తులనుబట్టి జాతు లుత్పత్తియయ్యె'
ననుచు మున్ను దయానందయతి వచించె.
'జగతి గుణకర్మలనుబట్టి జాతు లొదవె'
ననుచు శ్రీకృష్ణభగవానుఁ డానతిచ్చె.

‘పాపపంకిలచరితుండు బ్రాహ్మణుండె
యయ్యు. శూద్రునికంటె వాఁ డధమతముఁడు.
సత్య శాచాది సద్ధర్మశాలి శూద్రుఁ
డయ్యు, వాఁడె విప్రుం' డనె వ్యాసమౌని.

70