పుట:మధుర గీతికలు.pdf/440

ఈ పుట ఆమోదించబడ్డది



మలిన మనెడు పిశాచంబు తొలఁగఁద్రోసి
పారిశుద్ధ్యము తిరముగాఁ బాదుకొలిపి
పృథ్విఁ గాపాడ వెలసిన వేల్పు వీవు;
బళిర ఎంతటి-ధన్యజీవనుఁడ వయ్యఁ

ఏహ్య మగు దాని జూచి యసహ్యపడుట
తగదు తగ దంచు నీ చరితంబుచేత
చాటుచుంటివి ధర్మంబు జగతి కెల్ల
పూజ్య మగు నీదు త్యాగంబు పొగడఁ దరమె?

అనుపమం బగు సహనంబు నాత్మఁ దాల్చి
కులజు లొనరించు నవమానముల సహించి
కులజులకె నీవు సేవల సలుపుచుందు;
వౌర! నీవంటి పరమోపకారు లేరి?

ఇలను నాలుగుజాతులే వెలయుఁ గాని,
ఐదవది యగు వర్ణంబు లే దటంచు
స్పష్టముగ నెల్లరకు గీత చాటుచుండ,
పంచమునిగ నిన్ జనులు కల్పించినారు.