పుట:మధుర గీతికలు.pdf/437

ఈ పుట ఆమోదించబడ్డది


కొంతకాలము వారితోఁ గూడిమాడి
వారి యెనలేని ప్రేమను చూఱగొంటి;
మధురమగు వారి యుపదేశసుధలఁ గ్రోలి
అలవరచుకొంటి నా జీవితాశయముల.

వారితోనె గతించె నా కోరికలును,
ఆశయంబులు, నా యభిలాష లెల్ల;
అవనిలో నేను బ్రతికియున్నంతదనుక
వారి ఋణమును నేను తీర్పంగఁజాల.

వారితో నుండ, మాటాడ వారితోడ,
వారితోఁ గూడి తిరుగాడ వాంఛ సేతు;
వారి విడనాడి యక్కటా! బ్రతుకఁజాల,
నన్ను గొనిపొమ్ము దేవ! వా రున్నయెడకు.

వర మహాత్ముల చేతలు, వాక్యములును
అనుదినంబును మన జీవితాశయముల
సిద్ధి గావించి యున్నతస్థితికిఁ దెచ్చు;
వారి కొనరింతు నా నమోవాకములను.

64