పుట:మధుర గీతికలు.pdf/436

ఈ పుట ఆమోదించబడ్డది

నా చిన్ననాటి చెలికాండ్రు




ఏను తలఁచినయంత నా మానసమున
కానవత్తురు స్వర్గస్థు లైనవారు,
ఆ మహాత్ములు నా కూర్మి యనుఁగు సఖులు;
సంతతము నేను వారిని సంస్మరింతు.

అరమరలు లేని కూర్ముల ననఁగి పెనఁగి
లీలమై నాటపాటలఁ దేలియాడి,
మెలఁగితిమి వారు నేనును కలసిమెలసి
అకట! వారెల్ల నను వీడి రొకరొకరుగ.

బాళి నా కష్టసుఖములఁ బాలుగొనుచు
వారు నా కొనర్చిన యుపకారములను
తలఁచినపు డెల్ల నా మేను జలదరించి
కనుల వెంబడి బాష్పముల్ కాల్వగట్టు.

63