పుట:మధుర గీతికలు.pdf/426

ఈ పుట ఆమోదించబడ్డది


పూవుబొదరింటఁ గమ్మని తావు లొలయ,
ప్రేమగీతము లతఁ డాలపించుచుండు;
వాని తీయని చల్లని గాన సుధలు
విందు లొలికించు హాయిగా వీనుగవకు.

వాని వలవులగాలి నా వాంఛ లనెడి
యలల నుఱ్ఱూఁత లూగించె, నైనఁ గాని
త్రోసిపుచ్చితి నక్కటా ! బైసిమాలి
వాని నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ.

క్రించుదనమున నేను గావించినట్టి
చేతలకు వాఁడు బ్రదుకుపై రోతఁ జెంది
నన్ను నా గర్వమును వీడి, ఖిన్నుఁ డగుచు
వనములకు నేగి యచ్చట తనువు దొరఁగె.

క్రూర మగు నాదు ఘోరాపచారమునకు
ప్రతిఫలంబును ననుభవింపంగఁ దలచి,
అతఁడు చూపిన మార్గంబు ననుసరింపఁ
ద్రిమ్మరిలుచుంటి ఘోరవనమ్ములందు.

53