పుట:మధుర గీతికలు.pdf/425

ఈ పుట ఆమోదించబడ్డది



వాడు జనకుండు 'శుచిమతీ' నగరనేత,
రమ్యవిభవుండు, తేజోవిరాజితుండు;
వాని ఏకైక పుత్రికనైన కతన,
అతని యాస్తి కంతకు నేనె యర్హురాల.

నాడు ధనమును నన్నును నాదికొనఁగ
వరుస నెందరో యువకులు వచ్చి, నన్ను
స్తుతు లొనర్చిరి చక్కని చుక్క యంచు;
ఒక్కఁడును నాదు మనసున కెక్కఁ డయ్యె..

అరిగి రెల్లరు వారు హతాశు లగుచు;
ఒకఁడు మాత్రము నను వీడ నొల్లఁడయ్యె,
ఠీవి పదవియు నతనికి లేవు గాని,
సుగుణ మాతని పెట్టని సొమ్ము నుమ్మి.

చెలువు గలవాఁడు, చిఱునవ్వు గులుకువాఁడు,
హొయలు గలవాఁడు, మవ్వంపు వయసువాఁడు,
ఇవ్వి యన్నియు నటు లుండనిచ్చి నాదు
చిత్తమును చాల రంజిల్లఁ జేయువ్వాడు.

52