పుట:మధుర గీతికలు.pdf/416

ఈ పుట ఆమోదించబడ్డది



తన్ను కోయిల భక్షింపఁ దలఁచి యిట్లు
వచ్చియుండుట యెఱిఁగియు భయము గొనక
సరస గంభీర వాగ్ధాటి మెఱుఁగుపురుగు
ప్రియము గులుకంగ వశియించె పికముతోడ:

'చోద్య మగు నాదు తనుకాంతిఁ జూచు వేడ్క
సరగ వచ్చితె గాయకసార్వభౌమ!
మధురతరమగు నీ గానసుధల నేఁడు
కాంక్షమైఁ గ్రోలు భాగ్యంబు కలిగె నాకు.

నిన్ను చేసిన దేవుఁడే నన్ను చేసె;
సకల జీవులు నానందజలధిఁ దేల
గాన మొనరింప నిన్నును, కాంతి జూప
నన్ను దేవుండు నిర్మించినాఁడు కాదె!'

దాని పలుకుల కలరి యా గానమూర్తి
తనదు చేతల కెంతయు వనటనొంది;
ప్రీతి మీఱఁగ దానిని విడిచిపుచ్చి
అరిగె వే ఱొక్కచోటికి నాహరింప.

43