పుట:మధుర గీతికలు.pdf/411

ఈ పుట ఆమోదించబడ్డది




కొంద రందురు ప్రేమను గ్రుడ్డి దంచు,
పిరికిపంద యటంచును, పిచ్చి దంచు;
ఎంద రెన్ని విధంబులు నెంచ నిమ్ము -
దాని వారింప నేరికి తరము కాదు.

కంచుతలుపుల నడుమ బంధించి దాని,
విచ్చుకత్తుల పహరాలఁ బెట్టనిండు,
వాని నన్నిటి నెటొ పటాపంచ చేసి
ప్రేమ విహరించు నిచ్చలు బిచ్చలవిడి.

ఒడిసి పులిమీస లుయ్యాల లూఁగవచ్చు,
కూడి చిలువతో చెలగాట లాడవచ్చు,
అలుగుమొనమీఁద నాట్యంబు సలుపవచ్చు,
తొడరి నిప్పులగుండాస దూకవచ్చు.

ప్రణయవాహినీ వీచీపరంపరలను
అడ్డువెట్టుట కెవరికి నలవి కాదు;
ప్రేమ యొక్కెడ దృష్టి సారించెనేని,
లీల రెక్కలు గట్టుక వాలు నచట..

38