పుట:మధుర గీతికలు.pdf/407

ఈ పుట ఆమోదించబడ్డది



లోక మందలి యల్లకల్లోలములను,
భయద దారుణ ఘోర వీభత్సములను
లేశ మైనను మదియందు లెక్కగొనక
కాల మనలీల స్వేచ్ఛమై గడపు నతఁడు.

విధికృతంబునఁ దొడరెడు వ్యథల నతఁడు
స్వాంతమున నించుకేనియు సరకుగొనక
తనదు సదనంబు నందనోద్యానముగను,
తనదు చరితంబు వేదశాస్త్రముగఁ జేయు.

సద్గుణంబులె తన యాత్మసఖులు గాఁగ,
వినయవర్తనమే తన ధనము గాఁగ,
ధరణియే తన ధర్మసత్రంబు గాఁగ,
జీవితమే తీర్థయాత్రగఁ జేయు నతఁడు.

34