పుట:మధుర గీతికలు.pdf/401

ఈ పుట ఆమోదించబడ్డది



కన్ను గానక మదముచే నిన్ను మఱచి
గడపియుంటి గతించిన కాల మెల్ల;
నీదు కృప యింత నేఁడు నామీఁదఁ బఱపి,
ఉద్దరింపుము దరిఁ జేర్చి ఓ యనంత!

నాదు జీవిత మెల్ల నీ పాదకమల
సేవ చేయఁగ నేర్పుమా దేవదేవ!
హృదయమునఁ గల్గు దైనికవ్యథల నెల్ల
తాల్మితో నోర్చుకొన నాకు ధైర్య మిమ్ము,

నాదు చేతలచేత మనంబుచేత
నీ యనుజ్ఞను తలదాల్ప నేర్పు మయ్య!
నాదు సర్వము నీ కర్పణంబు చేసి
నిరతమును నిన్ను ధ్యానింప నేర్పు మయ్య

అఖిలజనులను ప్రేమతో నాదరించి,
అలుక యెఱుఁగక, మదియందు కలకలేక
అంత్యకాలము దాపించునంతదాక
ఓర్పుమై వేచియుండఁగ నేర్పు మయ్య!

28