పుట:మధుర గీతికలు.pdf/398

ఈ పుట ఆమోదించబడ్డది






చిమ్మచీఁకటిగొందిలో-చివికె దేల?
ఇవల వెలుతురులోనికి నిట్టె రమ్ము; "
పొత్తముల నేమి యున్నది చెత్త గాక
ప్రకృతియె నీకు బోధించు పరమగురువు.

ప్రకృతియందలి సుందర వస్తుచయము
జనుల మనముల కుత్సాహజనక మగుచు,
సదమలజ్ఞాన మారోగ్య మొదవఁజేసి,
అభినవవికాస మొనఁగూర్చి యలరఁజేయు,

బుధవరేణ్యులు బోధించు బోధకన్న
ప్రకృతియందలి బహువిధ వస్తుసమితి
అవగత మొనర్చు సృష్టిరహస్యములను;
గ్రంథములకన్న ప్రకృతియే ఘనతరంబు.

ప్రకృతి యొదవించు జ్ఞానంబు రమ్యతరము;
శాస్త్రములలోని మిడిమిడి జ్ఞానమెల్ల
సృష్టివస్తుల సౌందర్య సౌష్ఠవమును
వికృత మొనరించి దాని తబ్బిబ్బు సేయు.

25