పుట:మధుర గీతికలు.pdf/395

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న పురుగు




అడుగు మోపకు మక్కటా! దుడుకు మీఱ
దిక్కుమాలిన పురుగును త్రొక్కెదు సుమి;
నీచముగ నీవు నిరతంబు చూచుచున్న
చిన్నిపురుగును దేవుఁడే సృష్టి చేసె.

జీవకోటుల నెల్ల సృజించినట్టి
సృష్టికర్తయె నిన్ను సృజించినాఁడు;
తన యనంత కృపామృతధార నతఁడు
పురుగుపైఁ గూడ నొక్కింత దొరఁగఁజేసె.

చంద్ర సూర్యుల తారకా సముదయముల
సకలజీవుల కాతఁ డొసంగినాఁడు;
పురుగులును నీవు నడవంగ పుడమిమీఁద
గరికపోచతివాచీలఁ బఱచినాఁడు.

22