పుట:మధుర గీతికలు.pdf/394

ఈ పుట ఆమోదించబడ్డది





ఇప్పుడో యెప్పుడో యింకొకప్పుడైన
మృత్యువాతకు లోనౌదు రెల్లవారు,
ఒడలిలో కొనయూపిరి యున్నదాక
ఉస్సురని మూల్గి యుసురు వాయుదురు తుదకు.

మిట్టిపడఁబోకు జయము చేఁబట్టితి నని,
వడిగ నీ కీర్తిమంజరుల్ వడలఁబాఱు;
వెచ్చ నగు నీదు నెత్తురు వెల్లివిరిసి
మిత్తిదేవత బలిపీలిమీఁద పొరలు.

నీదు సుందరవదనంబు నిద్ర జెందు
మిత్తిదేవత యొడిలోని మెత్తమీఁద;
సుజను లగువారి సద్గుణసూన మొకటె
వారి గోరీల వికసించి పరిమళించు.

చావు చా వంచు భీరువు సారె వగచు,
ధీరుఁ డొకసారె మృతివేళ ధృతిఁ దొలంగు;
అఖిలజనులకు చా వెపుడైన నుండ,
మాటిమాటికి చావుకై మ్రంద నేల ?

21