పుట:మధుర గీతికలు.pdf/389

ఈ పుట ఆమోదించబడ్డది


కళలు స్థిరములు, కాలంబు గమనవేగి;
హృదయ మెంతటి ధీరంబు దృఢము నయ్యు,
మృత్యుభేరిని మ్రోఁగించి చైత్యయాత్ర
సరగ సాగించుచున్నది సారెసారె.

ఈ మహావిశ్వ రణరంగభూమియందు
జీవితం బను ప్రస్థానసీమ నిలిచి,
పిరికిపందలరీతిని పరుగులిడక
పోరు గావించి గెలువుమా వీరుఁడ వయి.

మాసిపోయిన ‘గతమును' మఱచిపొమ్ము,
'భావి' నమ్మకు మెప్పుడో వచ్చుదాని,
నిఖిల కల్యాణకర్త మైన 'నేఁడె' పూని
పనులఁ జేయుమి యీశు పై భార ముంచి.

వరమహాత్ముల జీవితచరిత లెల్ల
పావన మొనర్చు మానవజీవితముల;
దివికి నేగుచు కాలంపు దిబ్బమీఁద
విడిచెదరు వారు తమ కాలియడుగుజూడ.

16