పుట:మధుర గీతికలు.pdf/388

ఈ పుట ఆమోదించబడ్డది

జీవిత గీతము


జీవితం బొక కల యంచు చిత్రముగను
కవులు వర్ణించుచుందురు, కాని మనము
కల్ల యని భ్రమించిన దెల్ల కల్ల గాదు,
నిక్క మని నీవు నమ్ముమా నిశ్చయముగ.

జీవితము మిథ్య కా, దది స్థిరము ధ్రువము,
మరణ మొందుట దాని గమ్యంబు కాదు;
'మట్టిలో మట్టి కలియు' నన్నట్టి మాట
తనువునకె కాని, ఆత్మకు తగదు చెప్ప.

సారెకును మాయి సుఖదుఃఖసంచయములు
జీవయాత్రకు ప్రాప్యముల్ గావు తలఁప;
దినదినమ్మును నభివృద్ధి గనెడిరీతి,
కర్మ చేయుటయే దాని ఘనఫలంబు.

15