పుట:మధుర గీతికలు.pdf/387

ఈ పుట ఆమోదించబడ్డది


వరువముగ చేల ఫలియించు ప్రత్తిచెట్లు
పశువులకు మేత, వానికి వలువ లొసఁగు;
చేల నేపుగ నెదిగిన చెట్లు తనకు
పూలు పండ్లును చల్లని గాలి నిచ్చు.

పగటివేళల తోటలో పను లొనర్చు,
సందెవేళల నాటపాటలయందుఁ దేలు,
రేయి పవళించు నరుగుపై హాయి మీఱ,
గడపు నీలీల హాళిమై కాలమతఁడు.

హృదయశాంతియు తనుకాంతి గదుర నతఁడు
రోగ మెఱుఁగని సంతతారోగ్య మొంది,
అనిశ మీశ్వరధ్యానంబునందుఁ దవిలి
యిచ్చ మీఱఁగ దినములఁ బుచ్చుచుండు.

ఎవరి నెఱుఁగక, ఎవరిచే నెఱుఁగఁబడక
వానివలె నేను జీవింప వాంఛసేతు;
ఎవ్వరును నాదు మృతికయి యేడ్వకుండ
ఏకతమ్మున కనుమూయ నిచ్చగింతు.

14