పుట:మధుర గీతికలు.pdf/383

ఈ పుట ఆమోదించబడ్డది


బంతి మీటినగతి, నామె గంతులిడుచు
క్రేళ్ళువాఱుచు కేళిమై కాళ్ల వ్రేళ్ల
మంచుముద్దల నేగఁజిమ్ముకొంచుఁ జనియె
దూదిపింజలవలె నవి మీఁది కెగయ.

బెడిదముగ నంత చెలరేగె పెనుతుపాను;
ఏమి చెప్పుదు- నాబాల యెన్ని యెన్నొ
గిరుల నెక్కుచు డిగ్గుచుఁ దిరిగెఁ గాని,
కట్ట ! చేరంగలే దయ్యె పట్టణంబు.

పాప, మాతలిదండ్రు లా పాడురేయి
'లూసి లూసీ' యటంచు నా లోయ లెల్ల
మాఱుమ్రోఁగఁగ నఱచిరి సారెసారె,
కాని, ఏసడి యేజాడ గానరైరి.

విసిగి వేసరి వనటచే వెక్కి వెక్కి
యేడ్చి, వారు హతాశులై యింటిదెసకు
మగిడి యఱచిరి 'లూసిరో : మరల మనము
నాకమునఁ గూడుకొందము గాక ' యనుచు.

10