పుట:మధుర గీతికలు.pdf/380

ఈ పుట ఆమోదించబడ్డది


ఏమి యైనను గానిమ్ము - ఆమెగాన
మంతమొందదు, ఎంత సేపైనఁ గాని;
చేనిలోనుండి సేద్యంబు చేయుచున్న
యప్పుడెల్లను వినిపించు నామెపాట.

ప్రక్కనే యున్న కొండపై నెక్కి చనుచు,
విందు నాపాట వీనులవిందు లొలుక;
చిత్తరువు వోలె నంతనే చేష్ట లుడిగి
నిట్టనిలువున మ్రాన్పడి యట్టె నిలుతు.

చెవులచేరల, నాపాట చవులుగులుక,
జుట్టుకొందును చుబ్బనచూరలుగను;
ఎంత యాలించినను గాని తృప్తి గనక
మగుడ మగుడంగ నాలింప మనసుపుట్టు.

ఇప్పుడును నేను కొండపై నేగునపుడు,
పొలములోపల నాబాల కలదొ లేదొ-
ఎడద నాటిన యాపాట విడువ కెపుడు
రింగు మని మ్రోగు వీనులు పొంగిపొరలి.

7