పుట:మధుర గీతికలు.pdf/379

ఈ పుట ఆమోదించబడ్డది


ఓహొ ! ఆ పాట యెంత మనోహరంబొ :
దరిని సెలయేటి గలగలధ్వనులె సరిగ
తనదు పాటకు శ్రుతియును తాళములుగ
పాడుచున్నది యాబాల వేడుకలర.

దవ్వుదవ్వులనుండి యాదారిఁ జనుచు
మ్రానినీడను శ్రమవాయ మేనువాల్చు
పథికజనులను కోయిలపాట కన్న
కోమలం బయి సొక్కించు నామెపాట.

ఏమి పాడుచునున్నదో యెఱుఁగ రెవరు;
కరుణరసపూరిత పురాణగాధ లెవియొ,
కాక పల్నాటివీరుల కదనకథలొ,
వీరబొబ్బిలి వెలమలు విక్రమంలొ ?

గేయమో, లేక త్యాగయ్యకృతియొ, లేక
జానపదగీతమో, లేక జావళీయొ,
అదియుఁ గాక తరంగమో, అష్టపదులో,
మువ్వగోపాలపదములో - ఎవ్వఁడెఱుఁగు ?

6